*🌹బౌద్ధ ధమ్మంలో ఆషాడ పౌర్ణమి విశిష్టత.🌷*
*✍️అరియ నాగసేన బోధి*
*M.A.,M.Phil.,TPT.,LL.B*
*ధమ్మ ప్రచారకులు & న్యాయవాది*
*ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులు ఆషాఢ పౌర్ణమి రోజున "Asalha Puja Day" పేరుతో జరుపుకుంటారు.ఈ పండుగ సాధారణంగా జూలై నెలలో వస్తుంది. జూలై నెలలో వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజును బౌద్ధులు పవిత్రమైనదిగా భావిస్తారు.2024 వ సంవత్సరం జూలై 21 న ఆషాడ పౌర్ణమి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులంతా జరుపుకున్నారు..ఇదే గురు పౌర్ణమి జరుపుకోవడానికి పునాది అని చెప్పవచ్చును.*
*సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చెప్పిన విశ్వ గురువు తథాగత బుద్ధుడు.ఈ ప్రపంచానికి ధమ్మాన్ని బోధించిన ప్రవక్త బుద్ధుడు.లోక కల్యాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అసలైన ప్రవక్తలు భగవాన్ బుద్ధుడు,బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ లు*
*బహుజన హితాయ-బహుజన సుఖాయ అంటూ తన భిక్ఖు సంఘాన్ని ఏ ఒక్కరూ కలిసి వెళ్ళకుండా ధమ్మాన్ని ప్రజలకు బోధించమని చెప్పిన మహనీయుడు,జగద్గురువు బుద్ధుడు."అత్యధికుల మంచి కొరకు పనిచేసేది నా మతం. బహుజన హితంలో అమితానందం యిమిడి ఉంది. దాని విశిష్టత ఏమంటే దానికి ఆది,మధ్య, అంతాలు అంతా మంచిని కలిగించగలిగినవే." అని బుద్ధుడు అన్నారు.తన ధమ్మాన్ని భారతదేశంలోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన రెండో బుద్ధుడు సామ్రాట్ అశోకుడు.*
*నేడు ఆషాఢ పౌర్ణమి.భగవాన్ బుద్ధుడు తొలిసారిగా చేసిన 'ధమ్మ ఉపదేశానికి' ఇచ్చిన పేరు ధమ్మచక్కప్పవత్తన. పాళీ భాషలో "ధమ్మచక్కప్పవత్తన"ను తెలుగులో "ధర్మ చక్ర ప్రవర్తన"గా పిలుస్తారు. అనగా "సదాచార మార్గ రాజ్యం" , "సత్య సామ్రాజ్యం" అని కూడా భావించవచ్చును. బౌద్ధంలో "ధమ్మచక్కప్పవత్తనం" అనగా "జ్ఞాన సంస్థాపనాన్ని వివరించుట" అని అర్థం. ధమ్మచక్కప్పవత్తన అనగా ధమ్మ చక్రాన్ని తిప్పడం లేదా సత్య చక్రాన్ని స్థాపించుట అని చెప్పవచ్చును.ధమ్మచక్కప్పవత్తననే ఇంగ్లీష్ లో "Wheel of Law" అని అంటారు.*
*భగవాన్ బుద్ధుడు బోధించిన ధమ్మాన్ని చక్రం ఒక చిహ్నంగా భావిస్తారు. ఈ ధమ్మచక్రానికి ఎనిమిది ఆకులు(Spokes)ఉంటాయి.బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గానికి ఈ ఆకులు కూడా చిహ్నాలు. ధమ్మచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా భగవాన్ బుద్ధుని ధమ్మానికి కూడా ఆది ,అంతాలు లేకుండా శాశ్వతంగా ఉంటుంది.*
*ప్రపంచంలో ఉన్న మానవులు సుఖసంతోషాలతో బతకడానికి భగవాన్ బుద్ధుడు చతుర అరియ సత్యాలను మరియు అరియ అష్టాంగిక మార్గాలను,పంచ శీలాలను మొట్టమొదటి సారిగా ఉపదేశించిన వైనాన్ని ధమ్మ చక్కప్పవత్తన అంటారు.*
*🎋మహామాయ కలగన్నది కూడా ఆషాఢ పౌర్ణమి నాడే.🌹*
*జేష్ట్య పౌర్ణమి రోజున సిద్ధార్థ గౌతమి తల్లి మహామాయ గర్భం దాల్చినది.ఆ తరువాత పది నెలలకు అంటే వైశాఖ పౌర్ణమి రోజున కాబోయే బుద్ధుని ప్రసవించింది.శాక్యులు సిద్ధార్థ గౌతముడు పుట్టిన సందర్భంగా ఆషాడ మాసంలో వచ్చే ఏరువాక పండుగ రోజున భారీగా విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందులో శాక్యులు మత్తు పదార్థాలు సేవించడాన్ని నిషేధించారు.ఈ ఆషాడ పౌర్ణమి రోజున జరిగిన ఏరువాక పండుగలో మహామాయ తెల్లవారుజామునే నిద్ర లేచి చక్కగా అలంకరించుకుని నాలుగు లక్షల నాణాలు పేదలకు పంచింది. మహామాయ ఆషాడ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంది. మ్రొక్కుబడులు చెల్లించిన అనంతరం సాయంత్రం విందు చేసి తన ఏకాంత మందిరానికి చేరుకుంది. శుద్ధోధన మహారాజ్ మందిరానికి చేరుకున్నారు.ఇద్దరు సుఖించారు.దీర్ఘ నిదురలో ఉన్నప్పుడు మహామాయ ఒక కలగన్నది.ఆ కలలో నలుగురు ప్రపంచ పరిరక్షకులు వచ్చి మహామాయను హిమాలయాలకు ఎత్తుకుని వెళ్ళి పర్వత సానువుల్లో ఒక సాలవృక్షం కింద జేర్చారు.ప్రపంచ పరిరక్షకులు నలుగురు యొక్క భార్యలు వచ్చి మహామాయను మానససరోవరానికి తీసుకువెళ్ళారు.మహామాయను శుభ్రంగా స్నానం చేయించి మంచి వస్త్రాలతో సుగంధ ద్రవ్యాలతో పుష్పాలతో అలంకరించి సిద్దపరిచారు.సుమేధుడు అనే బోధిసత్త్వుడు వచ్చి "నేను చివరిసారిగా నీ ద్వారా ఈ భూమిపై పుట్టదలిచాను.అందుకు నీవు నాకు తల్లిగా ఉండటానికి అఃగీకరిస్తావా? అని అడుగుతాడు.అందుకు మహామాయ సంతోషంతో అంగీకారాన్ని తెలియచేసింది. అంతలో మహామాయకు మెలకువ వచ్చింది. ఈ విధంగా సిద్ధార్థ గౌతముని జననానికి ముందు బౌద్ధ సాహిత్యంలో కథలు అల్లుకుని ఉన్నాయి.*
*సిద్ధార్థుడు సన్యాసి అయినది కూడా ఆషాడ పౌర్ణమి నాడే.*
*సిద్ధార్థుడు శాక్య సంఘంలో సభ్యునిగా ఉన్నప్పుడు రోహిణి నదీజలాల వివాదం విషయంలో రాజ్యాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధపడతాడు.*
*సిద్ధార్థుడు తన 29వ సంవత్సరాల వయస్సులో ఇల్లు విడిచి ఆషాఢ పౌర్ణమి నాడు పరివ్రాజకుడైనాడు.*
*పంచవర్గ భిక్ఖువులకు ఉపదేశం ఇచ్చిన రోజు ఆషాఢ పౌర్ణమి.*
*భగవాన్ బుద్ధుడు సారనాథ్ లోని హరిణవనం(జింకలవనం)లో తొలిసారిగా ఐదుగురు భిక్ఖువులకు చేసిన ఉపదేశాన్ని ధమ్మచక్కప్పవత్తన సూత్రం అన్నారు. ఈ ఉపన్యాసంలోనే భగవాన్ బుద్ధుడు "మధ్యేమార్గాన్ని",అరియ సత్యాలను బోధించారు.*
*సిద్ధార్థ గౌతముడు తన 35వ సంవత్సరాల వయస్సులో ఆషాఢ పౌర్ణమి నాడే సారనాథ్ లోని జింకల వనంలో ఐదుగురు భిక్ఖువులకు తాను కనుగొన్న నూతన ధమ్మాన్ని బోధించారు. ఈ ఐదుగురు శిష్యులను పంచవర్గీయ భిక్ఖువులు అంటారు.*
*☘️పంచవర్గీయ భిక్ఖువులెవరు?🍀*
*భగవాన్ బుద్ధుని శిష్యులు మొదట ఐదుగురు.వీళ్ళు బుద్ధునితో పాటు సత్యాన్వేషణ కోసం సాధన చేసిన వాళ్ళు.అయితే బుద్ధుడు పూర్తిగా చిక్కి శల్యమై పోతోన్న దశలో సత్యాన్ని తెలుసుకొని సుజాత అనే స్త్రీ ఇచ్చిన భిక్ష తినడంతో ఈ ఐదుగురు శిష్యులు బుద్ధుణ్ణి అపార్థం చేసుకుని బుద్ధుణ్ణి విడనాడతారు.ఆ ఐదుగురు శిష్యులు ఎవరనగా...*
*1.కొండన్న(కౌండిన్య)*
*2.అశ్వజిత్*
*3.కాశ్యప*
*4.మహానామ*
*5.భద్రక*
*భగవాన్ బుద్ధుడు తను కనుగొన్న నూతన ధమ్మాన్ని ఎంత కష్టమైన ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుని పంచవర్గీయ భిక్ఖువుల కన్నా ముందుగా తన పూర్వ గురువులైన మేధావి, శాస్త్ర పరిజ్ఞానం గల అలారకాలాముడుకు బోధించాలని తలచగా ఆయన అప్పటికే నిర్యాణం చెందగా,గొప్ప వ్యక్తి ఉద్దకరామపుత్రుడుకు బోధించాలని భావించగా ఆయన నిర్యాణం చెందారు.కాశీ పట్టణంలో తనతో ఒకప్పుడు తపస్సు చేసిన ఐదుగురు భిక్ఖువులకు తన సిద్ధాంతాన్ని చెప్పాలని బయలుదేరతారు.దారిలో ఉపకుడు అనే జైన మతానికి చెందిన భిక్ఖువు కనిపించారు.బుద్ధుడు తనకు సంబోధి కలిగిందని జైన భిక్ఖు ఉపకునికి చెప్పగా ఉపకుడు నమ్మడు."సంబోధి కలిగితే,కలిగిందేమోలే!" అనుకుంటూ తన దారిన తను వెళ్ళిపోయారు.దీంతో బుద్ధుడు "ఇతర మార్గాలకు చెందిన వాళ్ళకి తన మార్గాన్ని అనుసరిస్తోన్న వాళ్ళకి తన మార్గం చెప్పడం వలన ఫలితం లేదు" అని బుద్ధునికి అనిపించి ఉండొచ్చు.బుద్ధుడు సారనాథ్ లోని జింకలవనం లో తనకు సేవలు చేసిన పంచవర్గీయ భిక్ఖువులను తన ధమ్మాన్ని బోధించడానికి ఎంచుకుంటారు. ఐదుగురు భిక్ఖువులు బుద్ధుని రాకను గమనించి ఎలాంటి ఆదరసత్కారాలు చూపకూడదని గట్టి నిర్ణయం తీసుకోగా బుద్ధుడు వాళ్ళని సమీపించేసరికి ఆదరసత్కారాలు చేస్తారు. అప్పుడు బుద్ధుడు ఆ శిష్యులతో "నేనొక నూతన ధమ్మాన్ని కనుగొన్నాను" అని చెబుతారు. "ఓ గౌతమానీవు కఠినమైన తపస్సు చేసినప్పుడు అన్నపానాలు రుచులకు అలవాటు పడ్డావు అలాంటిది నీకు ఎలా సంబోధి కలిగింది" అని ప్రశ్నిస్తారు.అంతలో బుద్ధుడు "నేనెప్పుడైనా తెలియంది తెలుసు అని నటించానా!నటించలేదనే నమ్మకం నాపై ఉంటేనే నా మాటలను వినండి,గొప్ప మార్గాన్ని నేను తెలుసంకున్నాను.మీరు కూడా ఈ మార్గంలో నడిస్తే మీకు సులువుగా విముక్తి లభిస్తుంది అని అన్నారు."*
*భగవాన్ బుద్ధుడు ఐదుగురు భిక్ఖువులను ఉద్ధేశించి "ఓ భిక్ఖువులారా! సన్యాసులు ఈ రెండు విషయాలలో చిక్కుకోరాదు.ఒకటి కామభోగాలలోనే సుఖం ఉందని అనుకుని ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడుతూ బ్రతకడం.ఇది హేయమైనది.కామభోగాలకు అంతు అంటూ ఉండదు.నికృష్ట మైనది.అజ్ఞానులు మాత్రమే ఈ కామభోగాలలోనే ఆనందం ఉందని భావిస్తున్నారు. వినాశనానికి దారితీసేది కామభోగలాలసత.కాబట్టి ఇది మంచిది కాదు.రేపు ఉంటామో లేదో తెలీదు కాబట్టి ఇప్పుడు తినడం ,తాగడం ద్వారా సుఖంగా గడిపేయాలని అనుకోవడం మంచిది కాదు.కామం అగ్ని లాంటిది.స్వార్థం వదిలిపెట్టి కామానికి లోనుకాకుండా ఉండాలి.కోరికలు మనల్ని కలుషితం చేయరాదు. సుఖాల కోసం ప్రాకులాట వలన మనిషి దిగజారుతాడు.కనీస అవసరాలు తీర్చుకోవడంలో తప్పులేదు.మానసిక కోరికలు అత్యంత ప్రమాదం.ఇవి మనల్ని బానిసలుగా చేస్తాయి. శరీరాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి మనం కృషి చేయాలి.శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా మంచిగా ఆలోచన చేయగలుగుతాం.*
*రెండోది శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా కోరికలను చంపుకోవాలని భావించడం.పూర్తిగా శరీరాన్ని శుష్కింపచేసే కఠోర తపస్సు వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఇది మామూలు మనిషి కూడా చేయడు.ఇది చాలా బాధతో కూడినది.హీనమైనది.ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టిన నిజాయితీ గల సన్యాసి ఈ జీవిత దుక్ఖాల నుండి విముక్తి చెందడానికి అత్యంత బాధతో కూడిన ఈ కఠోర తపస్సు చేస్తాడు.ఈ ప్రయోజనం లేని పద్ధతిలో బాధను చవి చూసిన బుద్ధుడు ఇది నిరుపయోగమైనది అని ,ఈ తపస్సు బాధను పెంచుతుంది తప్పితే తగ్గించలేదు అని బుద్ధుడు చెప్పారు.కాబట్టి బుద్ధుడు ఈ రెంటినీ పూర్తిగా వదిలిపెట్టి తథాగతుడైనాడు.మధ్యే మార్గాన్ని కొత్తగా ప్రవేశ పెట్టారు.*
*🌹మజ్జమ పటిపదా:🌷*
*తథాగతుడు బుద్ధుడు కనుగొన్న "మజ్జిమ పటిపదా" దీనినే మధ్యమ మార్గం అంటారు. ఈ మధ్యే మార్గం వస్తువులను ఉన్నది ఉన్నట్లు చూడమని దానికి ప్రజ్ఞ అవసరం అనీ చెబుతోంది.*
*బుద్ధుడు ఉపన్యాసం శ్రద్ధగా విన్న ఐదుగురు శిష్యులు ఆనాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత బుద్ధుడు చేసినదేంటని ప్రశ్నించారు. అప్పుడు బుద్ధుడు తాను మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత గయ వెళ్ళి బోధి చెట్టు క్రింద నాలుగు వారాల పాటు ధ్యానం చేసినట్లు ధ్యానం చేయడం వలన తనకు జ్ఞానోదయం కలిగింది అని అప్పుడే ఈ మధ్యే మార్గాన్ని కనిపెట్టానని చెబుతారు.ఆ ఐదుగురు పరివ్రాజకులు ఎంతో ఉత్సాహంతో మధ్యేమార్గాన్ని వివరించమని కోరతారు.*
*భగవాన్ బుద్ధుడు మధ్యేమార్గాన్ని గురించి ఇలా చెప్పారు : తన ధమ్మం లో దేవుడు, ఆత్మ అనేవి లేవు.చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనే ప్రశ్న అనవసరం.కర్మలు, క్రతులకు తన ధమ్మంలో స్థానం లేదు.మనిషి ముఖ్యం.భూమిపై మనిషికి మనిషికి మధ్య సత్సంబంధాలు ఉండాలి.మనిషి దుక్ఖంలో ఉన్నాడు.జన్మ దుక్ఖం. జర(ముసలితనం)దుక్ఖం, మరణ దుక్ఖం ,ఇష్టమైన వాళ్ళు దూరమైపోవడం దుక్ఖం, ఇష్టం లేనివాళ్ళతో జీవించాల్సిరావడం దుక్ఖం,కోరుకున్న వస్తువు దొరకకపోవడం దుక్ఖం.ఒక్కమాటలో చెప్పాలంటే ఐదు ఉపాదాన స్కంధాలు దుక్ఖాలే.కాబట్టి వీటిని ఎలా ఎదుర్కోవాలి అన్నదే తన ధమ్మం చెబుతోంది. ఈ దుక్ఖానికి పరిష్కారం ఏమిటని శిష్యులు ప్రశ్నించగా నిర్మలమైన జీవనం,సద్ధమ్మ విధానం, సౌశీల్యవంతమైన మార్గం లో పయనిస్తే దుక్ఖం అంతమవడం ఖాయం అని బుద్ధుడు చెప్పారు.*
*మధ్యేమార్గాన్ని అనుసరించాలంటే ఎనిమిది మార్గాలు ఉన్నాయి. ఆ ఎనిమిది మార్గాలనే అష్టాంగ మార్గం అంటారు.*
*☸️అరియ అష్టాంగ మార్గం:🌼*
*ఇందులో ఎనిమిది అంగాలు ఉన్నాయి...*
*1.సమ్మా దిట్టి ౼ సమ్యక్ దృష్టి*
*2.సమ్మా సంకప్ప ౼ సమ్యక్ సంకల్పం*
*3.సమ్మా వాచా ౼ సమ్యక్ వాణి*
*4.సమ్మా కమ్మంత ౼ సమ్యక్ కర్మ*
*5.సమ్మా ఆజీవ ౼ సమ్యక్ ఆజీవనం*
*6.సమ్మా వాయామ ౼ సమ్యక్ వ్యాయామం*
*7.సమ్మా సతి ౼ సమ్యక్ స్మృతి*
*8.సమ్మా సమాధి ౼ సమ్యక్ సమాధి*
*అష్టాంగ మార్గాన్ని అనుసరించడం వలన దుక్ఖాన్ని తొలగించుకోవచ్చు.ఈ ఎనిమిది క్రియలు బౌద్ధులైన వారికి ,బౌద్ధ ధర్మానికి ప్రధాన భూమిక అని చెప్పవచ్చును.*
*ఈ ఉపదేశాన్ని విన్న ఐదుగురు భిక్ఖువులు తమ పాత మార్గాన్ని వదిలిపెట్టి భగవాన్ బుద్ధుని మార్గాన్ని అనుసరించారు.తొలుతగా కొండన్న బుద్ధుని ఉపన్యాసాన్ని అర్థం చేసుకోగా తర్వాత నాలుగు రోజులకు మిగిలిన నలుగురు భిక్ఖువులు అర్థం చేసుకున్నారు. కొండన్న ధర్మచక్ర సూత్ర బోధన అనంతరం అరహతుడైనాడు.ఐదవ రోజున తథాగత బుద్ధుడు అనాత్మ సందేశాన్ని ఇచ్చారు.*
*🌹అనాత్మ సిద్ధాంతం:🔥*
*దీనిని పాళీ భాషలో "అనత్త లక్ఖన సుత్త" అంటారు. అనగా అనాత్మ లక్షణ సూత్రం అని అర్థం. మనిషి శరీరం మట్టి, నీరు ,అగ్ని, వాయువులతో నిర్మితమైనది.అనగా మనిషి శరీరం పంచస్కంధాలతో నిర్మితమైనది. ఈ ఐదు పంచ స్కంధాలలో దేనిలోనూ ,ఎక్కడా కూడా ఆత్మ అంటూ ఏదీ ఉండదు అని తథాగత బుద్ధుడు చెప్పారు. ఇది విన్న కొండన్న బోధి పొందారు.*
*భగవాన్ బుద్ధుడు రెండు అంత్యాలను,మధ్యే మార్గాన్ని చెప్పిన తర్వాత చతురార్య సత్యాలను వివరించారు.*
*🍀చతురారియ సత్యాలు:🌷*
*పాళీ భాషలో "అరియ సచ్చాని" అనగా అత్యంత గొప్పవారు అని , పాళీ భాషలో 'సచ్చ' నే సత్యం అంటారు. అరియ అనగా శ్రేష్ఠుడు అని అర్థం. (దీనినే విదేశాల నుండి వలసొచ్చిన బ్రాహ్మణులు తమను తాము శ్రేష్ఠమైన వారిగా చెప్పుకోవాలని పాళీలో ఉన్న అరియను తీసుకుని ఆర్యులు అని చెప్పుకున్నారు.) మానవ జీవితానికి సంబంధించిన నాలుగు సత్యాలను భగవాన్ బుద్ధుడు బోధించారు.అరియ అనగా క్లేశాలను క్షాళనం చేసుకున్న వారు అని. అరియ "వస్తువులు వాస్తవం గా ఎలా ఉన్నాయి అనేదాన్ని అలాగే" చూస్తారు.*
*🌱బౌద్ధం సారమంతా చతురార్య సత్యాలలో ఉంది. చతురార్య సత్యాలు నాలుగు..*
*1.దుక్ఖం సత్యం*
*2.దుక్ఖ సముదయం సత్యం*
*3.దుక్ఖ నిరోధం*
*4.దుక్ఖ నిరోధ మార్గం*
*మొదటి అరియ సచ్చ దుక్ఖం.జన్మించడం,ముసలితనం,జబ్బు పడడం ,మరణం దుక్ఖమే.ఇష్టమైన వాళ్ళు దూరమవడం ,ఇష్టం లేనివారితో జీవించాల్సిరావడం, కోరినవస్తువులు దక్కకపోవడం దుక్ఖానికి కారణాలు.*
*రెండో అరియ సచ్చ దుక్ఖానికి మూలం తృష్ణ. అన్నీ తృష్ణ వలనే కలుగుతాయి.ఇది చెప్పేది ఏంటంటే దుక్ఖం కానీ పునర్భవం(Rebirth) కానీ తృష్ణ వలనే ఏర్పడతాయి అని.*
*మూడో అరియ సచ్చ దుక్ఖ నిరోధం.అంటే తృష్ణ ను పారవేయడం,దాని నుంచి దూరంగా ఉండటం,ముక్తి పొందడం.*
*నాలుగో అరియ సచ్చ దుక్ఖనిరోధగామి ప్రతిపద అనగా దుక్ఖాన్ని తొలగించుకోవడానికి అరియ అష్టాంగ మార్గం ఉంది అని చెప్పేది.*
*భగవాన్ బుద్ధుని ఈ ధమ్మచక్కప్పవత్తనకు సారనాథ్ లో ధమ్మాశోకుడు క్రీ.పూ.3 వ శతాబ్దంలో స్ధూపాన్ని ,అశోక ధమ్మ చక్రాన్ని,నాలుగు సింహాల శిల్పాన్ని శాశ్వతంగా స్ఫూర్తిని కలిగించాలని ఏర్పాటు చేశారు. ధమ్మచక్కప్పవత్తన లో అశోకుడు పాత్ర విశిష్టమైనది.అశోకుడు ధమ్మచక్కప్పవత్తనను అనుసరించడం వలనే రెండవ బుద్ధునిగా పేరు తెచ్చుకున్నారు.*
*⛩️ధర్మ చక్ర పరిభ్రమణం మొదలైన స్థలంలో అశోకుడు నిర్మించిన స్తూపం ఈనాటికీ పర్యాటకులను ఉత్తేజ పరుస్తున్నది.*
*☸️ధమ్మచక్కప్పవత్తనలో బోధిసత్వ డా.బి.ఆర్.అంబేడ్కర్.*
*🐘1956 అక్టోబర్ 14 న బోధిసత్త్వునిగా మరియు నవబుద్దుడుగా పిలుచుకునే బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ సుమారు ఆరు లక్షల మంది తన అనుచరులతో బౌద్ధ ధమ్మ దీక్షను స్వీకరించారు.ఇది ధమ్మచక్కప్పవత్తనలో సువర్ణాధ్యాయం.బోధిసత్వ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రపంచంలోని చాలా దేశాలు బౌద్ధాన్ని అధ్యయనం చేస్తుంటే మన దేశంలోని ప్రజలు మాత్రం ఇంకా కట్టుకథలనే పట్టుకుని వేళ్ళాడుతున్నారు.ఎస్సీలు అయితే విదేశీ క్రైస్తవ మతంలో ఉంటూ పాస్టర్ లు చెప్పింది తప్ప ఇంకేం వినే పరిస్థితి లేదు.నిజమైన రక్షకుడు ,దేవుడు ఏసుక్రీస్తు అంటూ ఇంక అన్యుల గురించి మాకనవసరం అనే ధోరణి కలిగి ఉంటున్నారు.జపాన్ లోని బురాకుమిన్లు,హంగేరిలోని రోమాలు బోధిసత్వ డా. అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధాన్ని స్వీకరించాయి.ఇంకా ప్రపంచ వ్యాప్తంగా అనేకులు బౌద్ధాన్ని స్వీకరిస్తున్నారు.విదేశాలలోని అనేకులు బౌద్ధాన్ని అనుసరించి బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధ భిక్ఖువులుగా మారి లోక కల్యాణం కోసం కృషి చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 కోట్లకు పైగా బౌద్ధులు ఉన్నారు.ఈరోజు ఆషాఢ పౌర్ణమిని "ధమ్మచక్కప్పవత్తన డే" గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.*
*🍀శాక్యముని బుద్ధుడు ఐదుగురు భిక్షువులతో తొలి వర్షావాసాన్ని ఆషాఢ పౌర్ణమి రోజునే ప్రారంభించారు. భిక్షువులు ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ప్రారంభించి మూడు నెలలు పాటు విహారాల్లో గడుపుతారు.ఈ మూడు నెలలు ఆయా ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న ఉపాసకులు భిక్ఖువులకు భోజన సదుపాయం కల్పిస్తారు.*
*🛕భగవాన్ బుద్ధుడు మూడునెలల పాటు వర్షావాసంలో విహారాల్లో ఉండాలని నియమం పెట్టారు. ఎందుకంటే వర్షావాసంలో నదులు పొంగి ప్రవహిస్తాయి.దారులన్నీ జలమయం అవుతాయి. కాబట్టి ఈ మూడు నెలలు భిక్షువులు విహారాల్లో గడపాలని చెప్పారు.భిక్షువులు సాయంకాలం ధమ్మ ప్రవచనాలను చెబుతారు.ఉపాసకులు ఈ మూడు నెలలు పాటు ధమ్మాన్ని వింటారు. వాళ్ళకి ఈ మూడు నెలలు ఎంతో ముఖ్యమైనవి.*
*📚తథాగత బుద్ధుడు ఆషాఢ పౌర్ణమి రోజున సారిపుత్రునకు అభిధమ్మను ఉపదేశించారు. బౌద్ధ దేశాలు ఈ ఆషాఢ పౌర్ణమి రోజున అభిధమ్మను పఠిస్తారు.*
*🍀బుద్ధుడు మహాపరినిర్వాణం తరువాత అంటే వంద సంవత్సరాల తరువాత రాజగహలో జహసప్తపర్ణి గుహలో మొట్టమొదటి బౌద్ధ ధమ్మ సమ్మేళనం మహాకాశ్యప అధ్యక్షతన ఆషాఢ పౌర్ణమి రోజునే ప్రారంభమైంది.*
*🌼సద్ధమ్మం చిరకాలం వర్థిల్లాలి.🌱*
*🌾భవతు సబ్బ మంగలమ్.🎋*