గద్దర్ యుగకర్త!

 గద్దర్‌ యుగకర్త!

                   *- ప్రొఫెసర్‌ చింతకింది కాశీం*

తెలుగు సాహిత్యంలో ఆదికవులు, యుగకర్తలు, ప్రారంభకులు లాంటి వ్యక్తీకరణల మీద విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో సంప్రదాయవాదులు, ప్రగతివాదులు, ప్రజాస్వామికవాదులు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఎవరి అభిప్రాయాలు వారికున్నా, ఒకరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించకపోయినా ప్రధాన స్రవంతి సాహిత్యం మాత్రం తనదైన సంవిధానాన్ని రూపొందించుకున్నది. కొన్ని సాహిత్య ప్రమేయాలు, మరికొన్ని పరికరాల ఆధారంగా అకడమిక్‌ సాహిత్య బోధన జరుగుతుంది. ఈ క్రమంలో అనేక సంవాదాలూ జరుగుతుండవచ్చు, కానీ అధ్యయనానికి, అధ్యాపనకు ఏదో ఒక ఆలంబన ఉండాలి కనుక కొన్ని సాహిత్య పద్ధతులు, నిర్ధారణలు రూపొందాయి. సామాజిక నిర్మాణంలో, ఆచరణలో వచ్చిన మార్పుల ఫలితాలు సాహిత్యాన్ని గంభీరంగా మార్చివేసాయి. రాజకీయార్థిక సందోహాలు కూడా మార్గ సాహిత్య బోధన, అధ్యయనం మీద అనేక ప్రశ్నలను ఉంచాయి. సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఉత్పత్తి సంబంధాలు మూలంగా ఉండాలనే చర్చ కూడా 20వ శతాబ్దంలోనే జరిగింది.సాహిత్య, సాంస్కృతిక, విద్య లాంటి ఉపరితల రంగాలపై పాలకుల ఆధిక్యతనే కొనసాగుతుండటం వలన సాహిత్య చరిత్ర నిర్మాణం వారి ఇష్టాలకు అనువుగానే జరుగుతుంది. ఇంకో కోణంలో చెప్పాలంటే బౌద్ధిక రంగాల మీద ఉండే ప్రాబల్య వర్గాల సమ్మతే సాహిత్య నిర్ధారణలుగా ఉంటాయి. భారతీయ సాహిత్య ప్రపంచంలోకి మార్క్సిస్టు సంవిధానం ప్రవేశించాక మునుపటి సాహిత్య పద్ధతుల మీద, నిర్ధారణల మీద విస్తృత చర్చ ప్రారంభమయింది. సాహిత్యం రెండు శిబిరాలుగా విడిపోయి మార్క్సిస్టులు, సంప్రదాయవాదులు సాహిత్య పరిభాషలో తలపడ్డారు. ఈ నేపథ్యంలో సాహిత్యంలో ప్రజాస్వామిక దృక్పథం కలిగినవాళ్లు మధ్యమార్గాన్ని రూపొందించుకున్నారు. వీరిలో కూడా ప్రగతిదాయక ఆలోచనలే ఉన్నాయి. కొత్త పాతల మేలు కలయికలాగా సంప్రదాయవాదులలోని ప్రజానుకూల విషయాలను, మార్క్సిస్టులలోని ప్రగతిదాయక ఆలోచనలను సంలీనం చేసి నూతన సాహిత్య పరికల్పనలను, పరిశోధన పరికరాలను రూపొందించారు.ఆధునిక సాహిత్యంలో మార్క్సిస్టు దృక్పథం తర్వాత అస్తిత్వ సమూహాలు వేసిన ప్రశ్నలు సాహిత్యాన్ని విస్తృతి చేసాయి. ఈ సందర్భంలోనే ఆదికవి, యుగకర్త లాంటి ప్రయోగాల మీద వాటి ఔచిత్యం మీద లోతైన చర్చ జరిగింది. అంగీకారాలు, ఆమోదాలు, తిరస్కారాలు, తృణీకారాలు ఈ చర్చలో ఉన్నాయి. కానీ మొదటి కవిత, మొదటి కవి, పునాది, ప్రారంభకులు, మొదటి రచన వంటి ప్రయోగాలను ఈ ఉద్యమాలు కూడా సాహిత్య చర్చలో మినహాయించలేకపోయాయి. సాహిత్య రూపంలో వ్యక్తమవుతున్న జ్ఞానం ప్రజల నుంచి నేర్చుకున్నది కదా! దానిని సొంతం చేసుకొని కీర్తి కిరీటాలు పొందడం దేనికి అనే ప్రశ్నలు వేసినవాళ్లు ప్రశ్న దగ్గరే ఆగిపోయారు. సమాజంలో అన్నిరకాల వసతులు, సౌకర్యాలు అమరిన ఎగువ సామాజిక సమూహాల నుంచి వచ్చినవారు మాత్రమే సాహిత్య పీఠాల మీద కూర్చోవాలా? చాలా అరుదుగా దిగువ సమూహాల నుంచి వచ్చిన వారికి కనీస గౌరవం దక్కకుండా చేయడంలో ఉన్న ఆంతర్యాన్ని ప్రశ్నించడం మొదలయింది.ఈ నేపథ్యం నుంచి గద్దర్‌ను యుగకర్త అనడంలో సందేహించవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో శూద్ర, ముఖ్యంగా అతిశూద్ర వర్గం నుంచి ఎదిగిన అరుదైన సాహిత్య వ్యక్తిత్వం గద్దర్‌. తూప్రాన్‌ తుపాన్‌ బిడ్డగా రూపాంతరం చెందడానికి పునాది అక్కడే పడింది. వెలివాడలో తల్లి లచ్చుమమ్మ అంటరాని వసంతంలో గుమ్మడి విఠల్‌బాబు(1948)కు జన్మనిచ్చింది. తన పాలతో పాటు పాటను కూడా విఠల్‌బాబుకు లచ్చుమమ్మ తాగించింది. తండ్రి శేషయ్య, బుద్దుడు, కబీర్‌, అంబేద్కర్‌ను విఠల్‌బాబు జీవితంలోకి తీసుకొచ్చాడు. చదువు`కళ అతనికి రెండు కళ్లుగా మారిపోయాయి. పాడటం, ఆడటం, బుద్రకథ చెప్పటం ప్రవృత్తి అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైఫాబాద్‌ పీజీ కళాశాలలో పీయుసీ, ఇంజనీరింగ్‌ కళాశాలలో బి.ఇ. అభ్యసించాడు. బి.ఇ విద్యను అర్థాంతరంగా వదిలి బ్యాంకు ఉద్యోగంలోకి ప్రవేశించాడు.గుమ్మడి విఠల్‌బాబుకు ఆర్ట్‌ లవర్స్‌(1966)తో ఏర్పడిన పరిచయం తన ప్రపంచాన్ని విశాలం చేసింది. ఆర్ట్‌ లవర్స్‌ వ్యవస్థాపకుడు బి.నర్సింగరావు(మా భూమి సినిమా) నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలతో ప్రభావితుడై ఉన్నాడు. కనుక కళకు సామాజిక ప్రయోజనం ఉండాలనే తాత్వికతను పొందాడు. అందుకే విఠల్‌బాబు ఆర్ట్‌ లవర్స్‌కు పరిచయమయ్యాక(1971) సమాజం, సాహిత్యం వాటి మధ్య ఉండే గతితార్కికత తెలుసుకోగలిగినాడు. కవిత్వం, పాట రచనలో, ఇతివృత్తం ఎంపికలో స్పష్టత వచ్చింది. అప్పటివరకు గుమ్మడి విఠల్‌బాబుగా ఉన్న యువకుడు ‘‘ఆపురో రిక్షోడా రిక్షెంట నేనొస్త’’ అనే తన పాట ముద్రణలో విబి గద్దర్‌గా మారిపోయాడు. స్వాతంత్రోద్యమంలో గదర్‌ పార్టీ(తిరుగుబాటు) నిర్వహించిన విప్లవాత్మక పాత్రయే ఈ పేరుకు ప్రేరణ. ఇక తెలుగు నాట గద్దర్‌ అనే పేరు చరిత్రను సృష్టించింది. గద్దర్‌ జీవితాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.1. ఆర్ట్‌ లవర్స్‌కు పరిచయం కాని దశ2. ఆర్ట్‌ లవర్స్‌తో కలిసి నడిచిన దశ3. జననాట్యమండలి ఏర్పాటు`విప్లవదశఅయితే ఈ వ్యాసంలో సమగ్రమైన గద్దర్‌ జీవితం`సాహిత్యం మీద విశ్లేషణ చేసే పనిపెట్టుకోలేదు. నా ప్రధాన దృష్టి గద్దర్‌ యుగకర్త అని చెప్పటం మీదనే కేంద్రీకరించాను. కనుక నా ప్రతిపాదనకు కావలసిన ఉటంకింపులు, ఆధారాలు, సూత్రీకరణలను మాత్రమే ఈ వ్యాసానికి ఉండే పరిమితిగా గమనించగలరు.యుగము అనే పదానికి కృతము, త్రేత, ద్వాపరము, కలి అనే అర్థాలను నిఘంటువు చెబుతుంది. కానీ ఆధునిక కాలంలో నిర్ణీతకాలం అనే అర్థంలో వాడారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీలను ఆయా కాలాలకు యుగకర్తలని చెప్పారు. 1875 నుంచి 1925 వరకు ఈ యాభై ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కందుకూరి, గురజాడ, రాయప్రోలును భిన్న నేపథ్యాల నుంచి యుగకర్తలని చెప్పారు. అయితే సాహిత్య వస్తువు, భాష, ఛందస్సు, శిల్పరీతులు మొదలైన సాహిత్య గత విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆధునిక సాహిత్యానికి ముఖ్యంగా కవిత్వానికి యుగకర్త గురజాడ అని ఎక్కువ మంది విమర్శకులు, పండితులు అంగీకరించారు. ఇక ఆ తర్వాత 1930 నుంచి 1980 వరకు ఉన్న ఈ యాభై ఏళ్ల కాలానికి సంబంధించిన కవిత్వానికి శ్రీశ్రీని యుగకర్త అని, మహాకవి అని నిర్ధారణ చేసారు.1975 తర్వాత ఈ యాభై ఏళ్లలో తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్న వేసుకుంటే గద్దర్‌ తప్ప ఇంకెవరైనా ఉన్నారా? 1930 వరకు తెలుగు కవిత్వం నన్ను నడిపిస్తే ఆ తర్వాత తెలుగు కవిత్వాన్ని నేను నడిపిస్తానని శ్రీశ్రీ చెప్పింది ఎంత సత్యమో, 1975 తర్వాత తెలుగు కవిత్వాన్ని ఊగించి, శాసింది, నిర్దేశించింది గద్దర్‌ అని చెప్పటంలో శషభిషలు ఉండనక్కర్లేదు. ‘‘ఎవరు తమ రచనల ద్వారా వర్తమాన కాలమునకే కాక భవిష్యత్త్‌రముల వారికి అభినవోత్తేజము కల్గింతురో, ఎవరు గతానుగతికమై ఘనీభవించిన భావ ప్రపంచంలో ఉద్దామమైన ఉద్దీపనము కలిగింతురో, ఎవరు తమ తరువాతి అనేక కవులకు అనుకరణీయులౌదురో వారిని సాహిత్య రంగమున యుగకర్తలనవచ్చును’’(నారాయణరెడ్డి సి. 2011. పే.178). ‘సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన మహాకవిగా’ గురజాడ వారినే నవ్య కవిత్వమునకు యుగకర్తగా తాను భావించుచున్నట్లు శ్రీశ్రీ చెప్పారు(ప్రతిభ`1938) రచనలోని నవ్యత, దాన్ని ప్రచురించిన కాలం, తర్వాతి తరం మీద ఆ రచన ప్రభావం, విశేష ప్రజామోదం, గానరీతి, ప్రదర్శన పద్ధతిని మొదలైన గుణాలను బట్టి వారిని యుగకర్తలని అనవచ్చు. సామాన్య ప్రజల జీవితములను కావ్య వస్తువులుగా చేసి రాసిన కవులు యుగకర్తలవుతారని భావించిన సాహిత్య ప్రముఖులలో సినారె ఒకరు.గురజాడను మహాకవిగా, యుగకర్తగా గుర్తించడానికి కొందరు ఛాందస విమర్శకులు నిరాకరించారు. ఆయన రాసిన మహాకావ్యం ఏది? అనే ప్రశ్నను ముందుకు తెచ్చారు. కానీ యుగకర్త కావడానికి రామాయణం, భారతం లాంటి మహాకావ్యం అనే కొలమానం కాదని వర్తమాన జీవితాన్ని ఎంతగా సృజనాత్మకం చేసాడనేదే గీటురాయిగా తీసుకోవాలని శ్రీశ్రీ అన్నాడు. ‘‘కాని కవిత్వపు మంచి చెడ్డలను నిర్ణయించేది గ్రంథాల లావును, పై మెరుగులను బట్టి కాదు కదా! గురజాడ తన రచనా విధానంలోను, కవితా విషయంలోను కూడా విప్లవాన్ని తీసుకొచ్చాడు. కొత్త మార్గాన్ని తొక్కాడు.’’(శ్రీశ్రీ 1990. పే.15) తెలుగు సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు నన్నయను తెలుగు కవిత్వానికి సృష్టికర్త అంటున్నారు. తెలుగు కవిత్వానికి నన్నయ భిక్ష పెట్టాడని, కనుక ఆయన ఆదికవి అని, మహాకవి అని, యుగకర్త అని భావించారు. ప్రారంభంలో నన్నయ తెలుగు భాషకు సంబంధించి చేసిన కృషి పట్ల పండితులకు ఎనలేని గౌరవం ఉంది. ఉండవలసినదే. ప్రజల భాషకు, సంస్కృత భాషకు సంధి కుదిరించి కొత్త పదజాలాన్ని సృష్టించాడు. ఒకరకంగా సంస్కృతాన్ని తెలుగులో యదేచ్ఛగా వాడే విధానానికి పునాది వేసాడు. ‘‘తెనుగున నుత్తమమైన కావ్య రచనా మార్గము తీర్చిదిద్దెను’’(దివాకర్ల వేంకటావధాని,1981. పే.565) అనే అభిప్రాయాన్ని పండితులందరూ కల్గి ఉన్నారు. అందుకే ఆ కాలానికి ఆయన యుగకర్త అయ్యాడు.ఏ కాలంలోనైనా సరే కవిత్వం పాటలోనే బయలుదేరుతుంది. పండితభాషతో సంబంధం లేకుండా సౌందర్యాత్మకమైన పల్లె పదాలతో ఆ పాటలు రూపొందుతాయి. ఈ పాటలన్ని నియమ రహితాలే. ప్రజల నోటి ద్వారా ప్రచారం అవుతాయి. గ్రంథస్థమై ఉండవు. ఈ పాటలకు కొన్ని చోట్ల దీర్ఘపదాలు, మరికొన్ని చోట్ల హ్రస్వాంతపదాలు ఉంటాయి. ఇంకొన్ని చోట్ల ఈ రెండు కలగాపులగంగా కూడా ఉండవచ్చును. నూతన పద కల్పనలు జరిగిన చోట ఆ పాట కొత్త రూపాన్ని కూడా తీసుకుంటుంది. ఈ సంప్రదాయం నుంచి తెలుగు కవిత్వంలోకి ప్రవేశించిన వ్యక్తి గద్దర్‌. కనుక నన్నయ, గురజాడను యుగకర్తలుగా గుర్తించడానికి ఏ ప్రమాణాలనైతే సాహిత్య ప్రపంచం కలిగి ఉందో గద్దర్‌కు ఆ ప్రమాణాలే వర్తింపచేస్తే ఈ కాలానికి ఆయన యుగకర్తనే. ‘‘ఒక సాహిత్య మార్గం రావడం అంటే కేవలం వస్తువు మారడమో, భాష మారడమో, ఛందస్సులు మారడం మాత్రమే కాదు. రచనా సూత్రాలు మారుతాయి’’(వేల్చేరు నారాయణరావు, 2008. పే.86) ఈ సందర్భాన్ని గురజాడకు అన్వయించి ఈ కారణం చేత ఆయన ప్రారంభించిన కవితా మార్గానికి నిజమైన వారసులు లేకపోయారు. అందుకే గురజాడ యుగకర్త అనే విషయంలో ప్రశ్నలకు తావు ఏర్పడింది. కానీ గద్దర్‌ ప్రారంభించిన రచనా సంవిధానానికి వందలకొలది వారసులున్నారు. ఆయన ప్రారంభించిన కవితా మార్గం అసంపూర్ణ విప్లవం కాదు, దానికొక గతం, వర్తమానం, కొనసాగింపు ఉంది.ఎవరైతే సాహిత్య వస్తువులో, భాషలో, ఛందస్సులో మార్పుకు దోహదం చేస్తారో, కొత్త పుంతలు తొక్కుతారో వారే ఆ యుగానికి యుగకర్తలవుతారు. నన్నయ మొదలు పాల్కురికి సోమనాథుడు, గురజాడ, శ్రీశ్రీ తమ సాహిత్య పథంలో ఈ మూడు ప్రయోగాలను చేసారు. కనుక ఆయా కాలాలకు యుగకర్తలుగా రూపొందారు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువగా ప్రయోగాలు చేసి కవిత్వాన్ని పతాక స్థాయిలో నిలబెట్టిన కవిగా గద్దర్‌ మాత్రమే కన్పిస్తారు. తెలుగునాట 1970 జూలై 4న విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. సాహిత్య వస్తువులో, రూపంలో, భాషలో సమూల మార్పులు తీసుకరావాలని విరసం తన లక్ష్యంగా పెట్టుకున్నది. ‘‘..... ప్రజాసాహిత్య, కళా సృజన ద్వారా సంస్కృతిని, కళలను, విలువలను నిరంతరం విప్లవీకరించడం విరసం లక్ష్యం’’(విరసం ప్రణాళిక నిబంధనావళి). ఈ లక్ష్యం చేరుకోవాలంటే ఉత్పత్తి వర్గాల నుంచి కవులు ఎదిగి రావలసినదే. ఉత్పత్తి యేతర వర్గాల నుంచి వచ్చిన సృజనశీలురు ప్రజా కళారూపాలలో విప్లవ సారాన్ని చొప్పించలేరు. సృజనాత్మకం చేయలేరు. విప్లవ రచయితలు నవల, కథ, వచన కవిత రచనకు పరిమితమైతే మధ్యతరగతి వర్గాలను విప్లవానికి సానుభూతిగా మార్చగలరే కానీ విప్లవకర వర్గాలకు వీరి సాహిత్యం చేరలేదు. నిరక్ష్యరాస్యులైన ప్రజల జీవితాలను ప్రభావితం చేసి విప్లవానికి సన్నద్ధులను చేయాలంటే పాట, నాటకం, ఒగ్గుకథ రూపాలే సరైనవనే అవగాహన తెంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచే నాజర్‌ లాంటి కళాకారులకుంది. ప్రజల కళారూపాన్ని తీసుకొని, విప్లవ సారాన్ని జోడించి తిరిగి ప్రజలకు అందించే గతితర్కాన్ని మావో ప్రయోగం చేసి ప్రపంచానికి సందేశం పంపించాడు.విప్లవ కవులకు, రచయితలకు ఏర్పడిన పరిమితిని అధిగమించి కవిత్వాన్ని ప్రజలపరం చేసిన అద్వితీయుడు గద్దర్‌. ఆయన, కవిత్వ వస్తువులో మౌలిక మార్పును తీసుకొచ్చాడు. వర్గపోరాటమనే ఏకశిల భావన చుట్టూ పరిభ్రమిస్తుండిన విప్లవ కవులకు విశాల వస్తువు ప్రపంచాన్ని ఎలా దర్శించాలో గద్దర్‌ తన కవితా వైవిధ్యం ద్వారా ప్రత్యక్షం చేసాడు. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా తూర్పు యూరప్‌లో సోషలిస్టు విప్లవాలు విజయవంతమైన పద్ధతిలోనే ఇండియాలో సాధ్యమవుతుందని విప్లవ సృజనశీరులు భావించారు. కనుక దానికి తగిన సాహిత్య వస్తువునే వాళ్లు ఎంపిక చేసుకున్నారు. కానీ గద్దర్‌ తన జీవితంలో అనుభవించిన అణచివేత, అంటరానితనం నుంచి విప్లవాన్ని కలగన్నాడు. తన విముక్తి విప్లవంలో, వర్గ పోరాటంలో ఉంటుందని నమ్మాడు. అందుకే విప్లవాన్ని భిన్న మార్గాలలో ప్రయాణించే వర్గ పోరాటంగా సాహిత్యం చేసాడు. కులం, స్త్రీ సమస్య, ప్రాంతీయ ఆకాంక్షలు, ఆదివాసీ అస్తిత్వం లాంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలన్నింటికి పరిష్కారంగా విప్లవం, విప్లవ సాహిత్యం ఉండాలనేది తన అవగాహన. కనుకనే మొదటి నుంచి ఈ సమస్యలన్ని గద్దర్‌ కవిత్వానికి దినుసుగా మారాయి. విప్లవ కవిత్వానికి ఉండే స్వీయాత్మకతను సామాజికం చేసాడు. కంపెనిలో కార్మికులు, పొలాల్లో రైతులు మాత్రమే కాకుండా అనేక మానవ సంబంధాలను, జీవితపు పార్శ్వాలను, ఉత్పత్తి సంబంధాలను పాటలోకి తెచ్చి సమాజంతో సంభాషించాడు. విప్లవ కవిత్వానికి వస్తు విస్తృతిని కల్పించాడు. ‘‘ఈ పాటల్లో ప్రజలకి వర్గ దోపిడీని వివరిస్తూ వారిలో వర్గ చైతన్యం రగిలించడం, నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం యొక్క ప్రాధాన్యతను తెల్పి ప్రజలని అందులో సమీకరించడం, విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను గురించి చెప్పడం రచనా వస్తువు’’(కె.సురేష్‌కుమార్‌, 1995.పే.176)గద్దర్‌ విప్లవ కవిత్వంలో ప్రయోగించిన భాష విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నిజమైన అర్థంలో ప్రజల భాషను పాటలోకి ప్రవేశపెట్టాడు. భాష కవితా శిల్పంలో ఒక భాగం. రచయిత కవిత్వంలో వ్యక్తం చేసిన ప్రధాన భావం వస్తువైతే ఆ వస్తువు ఏ రూపంలో వ్యక్తమవుతుందో ఆ రూపమే శిల్పం. సాహిత్య ప్రక్రియ, భాష, భావ ప్రతిమలు శిల్పంలో ముఖ్యమైనవి. సాహిత్య శిల్పంలో ప్రధానమైన ఆకరమే భాష. ఈ భాష నిర్మాణాన్ని, ప్రయోగాన్ని కవిత్వంలో గద్దర్‌ వ్యక్తం చేసినట్లు మరే కవిలో చూడలేము. సాహిత్య నిర్మాణ పద్ధతులలో భాషను ప్రయోగించే పద్ధతినే శైలి అంటారు. మాట్లాడే భాషలోనూ, రాసే భాషోనూ శైలి భేదాలు ఉండటం సహజమైనదే. రచనలో భాషను వాడే నైపుణ్యాన్ని శైలి అంటారు. విప్లవ కవిత్వంలోకి తన పాటల ద్వారా గద్దర్‌ మౌఖిక శైలిని ప్రవేశపెట్టాడు. రాజకీయార్థిక విషయాలను, సైద్ధాంతిక అంశాలను, సామాజిక వైరుధ్యాలను ప్రతి వ్యక్తి అర్థం చేసుకునేటట్టు వివరించే భాష విప్లవ కవికి ఉండాలి. విప్లవ కవి తన సృజనను ప్రజల భాషలో అందించాలి. జనం బాణిలోకి కవిత్వాన్ని గద్దర్‌ తర్జుమా చేసాడు. ఆయన తన భావాలను, ఆలోచనలను ప్రజలతో ఏకరూపతలోకి తీసుకెళ్లాడు. మొదట గద్దర్‌ పాటలు తెలంగాణ మాండలికంలో రూపొంది తర్వాత అనేక మార్పులకు గురై సాధారణీకరించబడుతాయి. పట్టణ మధ్యతరగతికి, గ్రామీణ పేదలకు, పారిశ్రామిక వాడలలోని కార్మికులకు, పండిత వర్గానికి అర్థమయ్యే ఉమ్మడి భాషను రూపొందించి గద్దర్‌ పాటలను అల్లాడు. అందుకే ఆయన పాటలు ఈ అన్నివర్గాలకు చేరువయ్యాయి. ఆయన పాటకు మూడు గుణాలు ఉన్నాయి. ఆట, పాట, మాట. ఈ మూడు విడి పదాలుగా భాషలో, నిఘంటువులో ఉండవచ్చు. కానీ గద్దర్‌లో ఆ మూడుపదాలు లీనమయ్యాయి. కవి గాయకుడిలో ఇలాంటి అరుదైన లక్షణం కన్పించడం గద్దర్‌ విషయంలోనే సాధ్యమయింది. ‘‘ఆయన పాటలో ఆకాశం ప్రతిధ్వనించింది. ఆయన పాడితే శిలా పాలనం ప్రకంపించింది. ఆయన పెదవి విప్పితే పల్లె పదాలు జలజలరాలాయి. ఆయన పాటని గ్రామాలూ, నగరాలూ కూడా హృదయంలోకి హత్తుకున్నాయి’’(సురేశ్‌కుమార్‌, 1995. పే.185)గద్దర్‌ పాటకు ప్రత్యేక అస్తిత్వం ఏర్పడటానికి ఆయన ఎంపిక చేసుకున్న సాహిత్య రూపం పాట మాత్రమే కాదని కేవీఆర్‌ చెప్పి ఉన్నాడు. శ్రమజీవుల కన్నీళ్లకు, రాలిపడే చెమట చుక్కలకు, కారే నెత్తురుకు అక్షరరూపం ఇవ్వటం వలన గద్దర్‌ పాటకు నామవాచకం అయ్యాడు. ప్రజల జీవితాలను వాస్తవంగా, నిజాయితీగా చెప్పడానికి కావలసిన భాషను ఎంపిక చేసుకోవడంతో పాటు శ్రమైక జీవన వాతావరణంలో ఆయన సంచరిస్తాడు. జీవిస్తాడు. పదాల ఎంపిక, పదబంధాల నిర్మాణ కౌశలం, వాక్యప్రయోగం, అలంకారికత గద్దర్‌ పాటల్లో సందర్భానుసారం ఇమిడిపోతాయి. గద్దర్‌ పాటల్లో రచయిత కనిపించడు. ప్రజల ఆరాటాలను, పోరాటాలను కైగట్టి వారే పాటలను అల్లుకొని పాడుతున్న భావనకు శ్రోతలను గురిచేస్తాడు. ‘గద్దర్‌ ప్రజల తలలో పాటల నాలుకయ్యాడు’. పదాల ఎంపికలో గద్దర్‌ది ప్రత్యేక శైలి. పాటలో తాను చెప్పదలుచుకున్న భావానికి అనువైన పదబంధాలను రూపొందించుకుంటాడు. ఒక సన్నివేశాన్ని కళ్లకు కట్టడానికి ఆయనపడే తపన శ్రోతలందరి అనుభవంలోకి వస్తుంది. ‘వొడ్డెరోళ్లమండి మేము’ అనే పాటలో వారి జీవితాన్ని మనందరి స్మృతిపథంలోకి తీసుకొచ్చాడు. కొండలు పిండైపోవటం, చేతికందిన కొడుకు, పాలిడిసిన పానమున్న తల్లి, గుత్తబట్టిన దొరోడు లాంటి పదప్రయోగాలు శ్రోతకు విషయం పట్ల గాఢతను కల్గిస్తాయి. ‘రక్తంతో నడుపుతాను రిక్షాను’ పాటలో ఏపుకుతింటం పదప్రయోగం రిక్షా కార్మికుడి దుస్థితికి అద్దం పడుతుంది. ఎట్టి బతుకులు, దుక్కి, కంటి పాపలు, పంటసేల, కుప్ప, రాసి ఇత్యాది పదబంధాలు రైతు జీవితానికి అద్దం పడుతాయి. ‘పండుగింట్ల పీనుగెళ్ల పండుగ మీద పండుగొచ్చే’ లాంటి జాతీయాలు పాటలోని ఆర్థ్రతను పెంచుతాయి. గద్దర్‌ పాటల్లో ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ లాంటి అన్యదేశ్యాలు విరివిగా ఉంటాయి. వాటి ప్రయోగం వలననే గద్దర్‌ పాట అన్ని వర్గాలకు చేరువకావడానికి ఉపయోగపడుతుంది. అంగ్రేజి, ఇంగ్లీషు అని వేర్వేరు పదాలు వాడి ఇంగిలిపీసు లాంటి విరుపు పదాలను కూడా ఉపయోగించాడు. ‘ఆమ్యామ్యా లేకుంటే కామ్‌ నహీవోతాహై’. ఒక భాషకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక పలుకుబడులు జాతీయాలు అవుతాయి. ఈ జాతీయాలతో పాటు సామెతలు, లోకాక్తులు గద్దర్‌ పాటలో ఇమిడి పోతాయి. నన్నయ లాంటి సూక్తి నిధిత్వం గద్దర్‌ పాటల నిండా పరివ్యాపితమై ఉంటుంది. ‘అంగట్లోనా అన్ని వున్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు’, ‘ఇంటి దొంగను ఈశ్వరుడెరుగడు’, ‘చదువుకున్నోని కన్నా సాకలోడు మేలు’ మొదలైన ప్రయోగాలన్ని గద్దర్‌ తన పాటలలో సాధికారికంగా ఉపయోగించాడు.గద్దర్‌ పాటలో మార్గ ఛందో నియమం కంటే దేశీ ఛందోపద్ధతి ఎక్కువగా కన్పిస్తుంది. ఈ పాటలు శ్రమలో నుంచి పుట్టటం వలన లయ ప్రధానంగా ఉంటుంది. ఈ లయనే పాటలోని అక్షరాలను నియంత్రిస్తుంది. లయకు అనువుగా అక్షరాలను తగ్గించటమో, పెంచటమో గద్దర్‌ పాటల్లో కన్పిస్తుంది. కానీ పాట అసాంతం ఒకే ఛందో నియమం పాటించటం సాధ్యం కాదు. ఆయన చాలా సందర్భాలలో ఛందస్సును విరిచేస్తాడు. అక్షరాలను కలిపేస్తాడు.‘‘వోట్లేసి పెంస్తిమిరో దొరోడోనిన్ను మాటుగాసి సంప్తమురో దొరోడోకాల్గడుపులు మొక్కినోల్లమె దొరోడో’’ ఈ పాదాలలో అక్షరాలను తగ్గించటం కోసం రచయిత చేసిన ప్రయోగాన్ని గీతగీసిన పదాలలో గమనించవచ్చు. మౌఖిక గీతాల్లో సాధారణంగా 5 మాత్ర గణాలు కన్పిస్తుంటాయి. అయినా కొన్ని చోట్ల మాత్రల సంఖ్య పెరగడం, తగ్గడం ఉంటుంది. ఈ ఎగుడు దిగుడును గద్దర్‌ పాటలలో కన్పిస్తుంది. కనుక గద్దర్‌ గానయోగ్యతను ప్రధానం చేసాడు, దానికి తగిన ఛందో పద్ధతిని పాటించాడు. ఇది ఆయనకే సాధ్యమవుతుందన్నట్లు సొంతం చేసుకున్నాడు.వస్తువు నవ్యత, భాష నవ్యత, ఛందో నవ్యత గురజాడ, శ్రీశ్రీతో పాటు గద్దర్‌లో కూడా కనిపించే సాధారణ లక్షణాలు. అయితే వీరి కంటే అదనంగా గద్దర్‌ ఆహార్యం ప్రత్యేకమయినది. ఆయన వేదిక మీదకు ప్రవేశిస్తున్నాడంటే ఒక కళాఖండం వస్తున్నట్లు ఉంటుంది. ఆ ఆహార్యం గద్దర్‌కు మాత్రమే సొంతం. మునుపటి ప్రజానాట్యమండలి పరిమితులను దాటి గద్దర్‌ కొత్త ప్రదర్శన రీతులను వేదిక మీదకు తెచ్చాడు. తెలంగాణ ప్రాంతంలో గొల్ల కురుమ సామాజిక వర్గం కళారూపమైన ఒగ్గు కథను పరిశీలించిన గద్దర్‌ దానిలో చాలా మార్పులు చేసాడు. కొత్త ఒగ్గు కథా రూపాన్ని తయారుచేసాడు. ప్రదర్శనకు ముందు శ్రోతలలో దాక్కొని కళాకారులు ఉంటారు. భిన్న మూలల నుంచి వేదిక మీదకు రావటం వలన శ్రోతలలో ఆసక్తిని రేకెత్తించే పద్ధతిని గద్దర్‌ ప్రవేశపెట్టాడు. ప్రజల బాణీలను విప్లవీకరించి ఒగ్గుకథను రూపొందించాడు. నక్సల్బరీ బిడ్డలు, ఉద్దానం వీరులు, స్వర్ణ ఒగ్గుకథ, ఓరుగల్లు వీరులు, రగల్‌జెండా లాంటి విప్లవ సందేశ రూపంగా ఒగ్గు కథ కళారూపాన్ని మలిచాడు. పాటకు పల్లవి, చరణం ఉండటం సహజం. కాని పాటకు ఒక సాకీని రూపొందించి ప్రదర్శించిన మొదటి వ్యక్తి గద్దర్‌ మాత్రమే. గద్దరంటే శబ్దం. పాటకు సానుకూలమైన శబ్దాన్ని చేయటం, రాగాన్ని తీయటం ఆయన సొంతం.గోచి, గొంగడి, మెడలో రుమాలు, చేతిలో ఎర్రని జెండా, మరో చేతిలో కట్టె, పెరిగిన జులపాలు, గడ్డం, కాళ్లకు గజ్జలు... ఇవి గద్దర్‌ ఆహార్యం. గాత్రమంతా గాత్రమై సింహంలా వేదిక మీద లంఘించే తీరు యుద్ధ సందర్భాన్ని తలపిస్తుంది. ఆయన పాటకు కొనసాగింపైన వంతకులుంటారు. ప్రధాన గాయకుడు పూర్తి పాటను పాడకుండా కోరస్‌ ఇచ్చేవారు పాటలోని తర్వాతి చరణాలను అందుకునే సంప్రదాయాన్ని గద్దర్‌ నెలకొల్పాడు. లయాత్మకంగా తన సహచరులతో కదులుతూ ఒక అద్భుత నృత్యరూపకాన్ని ప్రదర్శిస్తారు. ఆయనకు మాత్రమే సొంతమైన మ్యానరిజాన్ని స్థిరపరిచాడు.ఈ యాభై సంవత్సరాలలో(1973-2023) వచన కవిత్వం రాసిన ఏ కవి కూడా గద్దర్‌తో సరిపోలలేరు. పాటనే కవిత్వం, కవిత్వమే పాట లాగా గద్దర్‌ తెలుగు నాట రూఢీ చేసాడు. తన పాట రచన చేత తెలుగు కవిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. గద్దర్‌కు ముందు తెలుగు కవిత్వం గద్దర్‌ తర్వాత తెలుగు పాట అనే విభజన రేఖను గీసాడు. వేమన, అన్నమయ తమ కవిత్వం ద్వారా, కీర్తన ద్వారా కొందరి ప్రజలను చేరుకోగల్గినారు. కానీ గద్దర్‌ తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరితో, దేశవ్యాపితంగా తెలుగేతర ప్రగతిశీల, ప్రజాస్వామిక, దళిత వర్గాలకు కూడా తెలుసు. ఇంతటి విశేష ప్రాచుర్యం కలిగిన మరో కవి భారతీయ భాషలలో లేడు. గురజాడ పూర్ణమ్మ, శ్రీశ్రీ బిక్షువర్షియసి, కవితా ఓ కవితా, శివసాగర్‌ చెల్లీ చంద్రమ్మ లాంటి పాత్రలు, జీవితాలు, కవితా విలువలు గద్దర్‌ ఎన్నింటినో సృష్టించాడు. ఈ యాభై ఏళ్లలో గద్దర్‌ వలె పాడాలని, ఆడాలని, రాయాలని, ఆహార్యం ఉండాలని తపించేవాళ్లు వందల సంఖ్యలో ఉంటారు. శ్రీశ్రీ కంటే ఎక్కువ మంది గద్దర్‌ను అనుసరించే వాళ్లు ఉన్నారు. కొన్ని తరాల మీద గద్దర్‌ చెరగని ముద్రవేసాడు. అతని ప్రభావం మరో యాభై ఏళ్లు ఉంటుందని చెప్పటంలో అతిశయోక్తి ఉండకపోవచ్చు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో ఒక కథాపుర్షుడు వెన్నుపూసలో తుపాకి గుండుతో పాతిక సంవత్సరాలు సమాజాన్ని గానం చేసాడు. అందుకే ఆయన యుగకర్త. ఇపుడు గద్దర్‌ లేడు. ఆయన పాట గాలిలో పరివ్యాపితమై ఉంది. ప్రజల నాలుకలలో సుకవిలా జీవిస్తూనే ఉంటాడు.